తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీకి వస్తున్న ఆయన పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై అంతర్రాష్ట్ర జలాల అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి తమిళనాడు సీఎంవో అధికారులు, భద్రతా సిబ్బంది ఇప్పటికే విజయవాడకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.
విజయ్ మధ్యాహ్నం 2.30 గంటలకు చెన్నైలోని నీలంకరై క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 3 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఆయనకు స్వాగతం పలికిన అనంతరం, 4.10 గంటలకు ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరుతారు. సాయంత్రం 4.55 గంటలకు ఆలయానికి చేరుకుని, 5 గంటల నుంచి 5.45 గంటల వరకు అమ్మవారిని దర్శించుకుంటారు.
దర్శనం అనంతరం విజయ్ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా తెలుగు గంగ పథకం కింద చెన్నై నగరానికి సరఫరా చేయాల్సిన కృష్ణా జలాల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి చెన్నైకి నీటి సరఫరా, అలాగే దక్షిణ భారతదేశంలో గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధాన ప్రతిపాదనలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తమిళనాడు ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర నదీ జలాల అంశంపై ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కావడం ఈ పర్యటనలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చల్లో తీసుకునే నిర్ణయాలు, తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది.
చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం విజయ్ విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద ఉన్న ఉత్సవ్ గ్రౌండ్‌కు వెళ్లనున్నారు. రాత్రి 7.10 గంటలకు అక్కడికి చేరుకుని విజయవాడ ఉత్సవ్ 2.0లో నిర్వహించే కళా ప్రదర్శనలను వీక్షించడంతో పాటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం రాత్రి 8.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరిగి చెన్నైకు బయలుదేరుతారు.
విజయ్ పర్యటన షెడ్యూల్
-
మధ్యాహ్నం 2.30 గంటలు: నీలంకరై క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరడం
-
మధ్యాహ్నం 3.00 గంటలు: చెన్నై విమానాశ్రయానికి చేరుకోవడం
-
సాయంత్రం 4.00 గంటలు: గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడం
-
సాయంత్రం 4.10 గంటలు: కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరడం
-
సాయంత్రం 4.55 గంటలు: ఆలయానికి చేరుకోవడం
-
సాయంత్రం 5.00–5.45 గంటలు: అమ్మవారి దర్శనం
-
సాయంత్రం 6.00–7.00 గంటలు: చంద్రబాబుతో సమావేశం
-
రాత్రి 7.10 గంటలు: విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి చేరుకోవడం
-
రాత్రి 8.50 గంటలు: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని చెన్నైకు పయనం






