ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆళ్ల నాని రాజకీయ జీవితంలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. జగన్ ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన ఆకస్మిక మరణంతో ఏలూరు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆళ్ల నాని మృతి పట్ల మాజీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి సంతాపం తెలిపారు.. రాష్ట్రానికి ఆళ్ళ నాని చేసిన అంకితభావంతో కూడిన ప్రజా సేవ, చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు మరియు అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. ఓం శాంతి అంటూ పేర్కొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు,అభిమానులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Deeply saddened by the passing of Shri Alla Kali Krishna Srinivas (Alla Nani), former Deputy Chief Minister of Andhra Pradesh. His dedicated public service and contribution to the state will always be remembered. Heartfelt condolences to his family, supporters and admirers. May… pic.twitter.com/FA24VbHC4E
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2026







