వైఎస్సార్‌సీపీ మాజీ నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇంటి వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తిమండలోని రాపాక ఇంటి వద్ద నిర్మించిన సీసీ రోడ్డుకు సంబంధించిన 9 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అలాగే రాకపోకలకు అడ్డుగా ఉన్న గేటును తొలగించాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో రాపాక వరప్రసాదరావు ఇంటి సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. 2019-20లో అప్పటి అమలాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనురాధ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ రోడ్డు నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించినట్లు సమాచారం.
ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన ఎంపీ ల్యాడ్స్ నిధులను ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లే ప్రైవేటు రోడ్డు నిర్మాణానికి ఎలా కేటాయిస్తారంటూ జనసేన నేత వెంకటపతిరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం గతంలోనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మించిన భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు, రాకపోకలకు అడ్డుగా ఉన్న ప్రహరీ, గేటును తొలగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం.
అయితే గతంలో జారీ చేసిన ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలుస్తోంది. తాజాగా కేంద్రం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించడంతో ఈ రోడ్డు వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.






