ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. సుమారు పది రోజుల క్రితం యువతిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో పడేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కూలింగ్ కెనాల్లో లభించిన మృతదేహ భాగాలను పరిశీలించిన పోలీసులు.. మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించినట్లు తెలిపారు. ఆమె చేతిపై ఉన్న ప్రత్యేకమైన టాటూ ఆధారంగా ఓ వ్యాపారి అందించిన సమాచారంతో మృతురాలి వివరాలను నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు. దీంతో కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ముందడుగు వేశారు.
కళ్యాణి హత్యకు వ్యక్తిగత సంబంధాలు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. హత్యకు ముందు కళ్యాణి ఎవరితో కలిసి నివసించింది? ఎవరితో సన్నిహితంగా ఉండేది? చివరిసారిగా ఎవరితో కలిసి ఉంది? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతదేహాన్ని పలు భాగాలుగా చేసి కూలింగ్ కెనాల్లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించడం సవాలుగా మారిన సమయంలో చేతిపై ఉన్న టాటూ కీలక ఆధారంగా మారింది.
కళ్యాణి చివరిగా ఎవరితో మాట్లాడింది, ఆమె ఫోన్ కాల్స్, పరిచయాలు, నివాస వివరాలు, గత కొంతకాలంగా ఆమెకు ఉన్న సంబంధాలు వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులను గుర్తించేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.






