ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. బెంగళూరులోని ఓ పబ్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగి, దూషించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ అధికారిని నియమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు నగరంలోని పలు పబ్‌లు, బార్లలో తనిఖీలు నిర్వహించారు. మైనర్లకు మద్యం విక్రయిస్తున్నారా? బాలలను పనిలో పెట్టుకుంటున్నారా? అనే అంశాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో రెసిడెన్సీ రోడ్డులోని ఓ పబ్‌కు చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తన స్నేహితులతో కలిసి అక్కడ ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులకు, ఆయన బృందానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులను దూషిస్తున్నట్లుగా కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ ఘటన నేపథ్యంలో వికాస్ మర్మత్‌పై కేసు నమోదైనట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆయనను కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ పరిణామం ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






