తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన అగ్గిపెట్టె మచ్చ.. అలియాస్ కిరణ్ కుమార్ ఇక లేరు. ప్రముఖ కమెడియన్, యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. అగ్గిపెట్టె మచ్చ పేరుతో సోషల్ మీడియాలో కిరణ్ కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తనదైన మాటతీరు, కామెడీ టైమింగ్, హావభావాలతో ఆయన చేసిన వీడియోలు, రీల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ వేదికగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడటంతో పాటు పలువురు యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు ఆయనతో ఇంటర్వ్యూలు చేసేందుకు ఆసక్తి చూపించారు.






