ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ తొలి విడతగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
రాష్ట్రంలోని పలు నగరపాలక సంస్థలకు సంబంధించి మేయర్ అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి, తిరుపతి మేయర్ అభ్యర్థిగా శిరీషకు మరోసారి అవకాశం కల్పించింది. విజయనగరం నుంచి కోలగట్ల శ్రావణి, విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, ఏలూరు నుంచి గంటా మోహన్‌రావు (జీఎంఆర్), మచిలీపట్నం నుంచి లంకా జ్యోతి, ఒంగోలు నుంచి కుప్పం ప్రసాద్, నెల్లూరు నుంచి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, కడప నుంచి బండి దీప్తిరెడ్డిని మేయర్ అభ్యర్థులుగా ప్రకటించినట్లు సమాచారం.
ఇదే సమయంలో పలు మున్సిపాలిటీలకు ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడించింది. ఇచ్చాపురం నుంచి రాజ్యలక్ష్మి, పలాస నుంచి తలసు శ్రీపద్మ, నర్సీపట్నం నుంచి చింతకాయల అనిత, యలమంచిలి నుంచి బి. తులసి, తుని నుంచి పిట్ల రామతులసి, కొవ్వూరు నుంచి మన్నె పద్మ, రామచంద్రాపురం నుంచి నాగేశ్వరరావును అభ్యర్థులుగా పేర్కొంది.
అలాగే కొండపల్లి నుంచి నల్లమోతు తేజస్వి, తెనాలి నుంచి మద్దాలి శేషాచలం, చీరాల నుంచి డాక్టర్ ఇస్తార్ల శెర్లి, మదనపల్లె నుంచి జింక చలపతి, బద్వేల్ నుంచి రాచపూడి వెంకట సాయి కృష్ణ, ప్రొద్దుటూరు నుంచి పొర్రెడ్డి నరసింహారెడ్డి, పులివెందుల నుంచి వైఎస్ ప్రమీలమ్మను మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించింది. ఏలేశ్వరం నగర పంచాయతీ అభ్యర్థిగా జి. ఆశాలత పేరును వెల్లడించింది. మిగిలిన నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తదుపరి ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలపై దృష్టి సారించాయి.






