మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు తేదీ, సమయాన్ని ఖరారు చేశారు. నవంబర్ 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే రోజు పార్టీ జెండా, ఎజెండాను వెల్లడించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలే ప్రధాన లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ ఆధారిత రాజకీయాలకు, కుల, మత విభేదాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తన ప్రకటనలో వివరించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, విద్యుత్ కోతలు లేకుండా చూడటం, ప్రతి ఎకరానికి రెండు పంటలకు సరిపడా సాగునీరు అందించడం, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ కల్పించడం తమ పార్టీ లక్ష్యాల్లో భాగమని తెలిపారు. విద్యా ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
అలాగే పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు పెరిగేలా, వారి జీవన వ్యయాలు తగ్గేలా విధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా నెరవేరని ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంతో పాటు, యువతలో కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించే వేదికగా పార్టీని తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వారంతా కొత్త పార్టీకి మద్దతు ఇవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో దాని విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






