ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ మార్పులు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు, టీడీపీ నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఎస్. ఉమామహేశ్వరరావు సైతం జనసేనలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో అరకు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. ద్వారపురెడ్డి జగదీష్‌కు జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీష్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని నాగబాబు తెలిపారు. జనసేన అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగానే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చే మంచి నాయకులకు స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.
కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు..
ద్వారపురెడ్డి జగదీష్‌కు పార్వతీపురం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, క్రమంగా పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. 2011లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2015లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై 2021 వరకు ఆ పదవిలో కొనసాగారు.రాజకీయ బాధ్యతలతో పాటు ఆంధ్రప్రదేశ్ టూరిజం డైరెక్టర్‌గా, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆయన భార్య శ్రీదేవి పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు..
టీడీపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన జగదీష్ జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పరిణామం పార్వతీపురం రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.






