గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు వారి పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినప్పటికీ ఆందోళనలు కొనసాగించడంపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు.
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 15 వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. అయినప్పటికీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం వెనుక కొన్ని శక్తుల ప్రేరేపణ ఉందని ఆరోపించారు.
గత ప్రభుత్వం సరైన సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చిందని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం ఆ విధానాన్ని సరిదిద్ది ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుందని తెలిపారు. ఉద్యోగులు ఈ అంశాలను గమనించాలని సూచించారు.
నోషనల్ ఇంక్రిమెంట్లపై మంత్రి స్పష్టత
సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి డీఎస్‌బీవీ స్వామి స్పష్టం చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా అమలు లేని పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులకు మాత్రమే వాటిని ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నించారు.
అనుమతి లేకుండా ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు చేపడితే ప్రభుత్వం సహించబోదని ఆయన అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని తెలిపారు.
గతంలో కొందరు ఉద్యోగులు కేవలం రూ.15 వేల వేతనంతో రెండేళ్ల పాటు విధులు నిర్వహించిన సమయంలో ఎలాంటి ఆందోళనలు చేయలేదని, ప్రస్తుతం మాత్రం నిరసనలకు దిగడం ఆశ్చర్యంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.
సచివాలయ ఉద్యోగులను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నారని ఆయన విమర్శించారు.
అయితే ఉద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డీఎస్‌బీవీ స్వామి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ఉద్యోగులు దృష్టి సారించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.






