బయట మార్కెట్లో బియ్యం ధరలు పెరిగి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతు బజార్ల ద్వారా బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.49కు విక్రయిస్తుండగా, తాజాగా కేఎన్ఎం (KNM), ఆర్ఎన్ఆర్ (RNR) రకాల సన్నబియ్యాన్ని కిలో రూ.50కే అందించేందుకు నిర్ణయించింది. ఈ విక్రయాలను విజయవాడలోని భవానీపురం రైతు బజార్లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నిర్ణయించిన ధరకు బియ్యాన్ని విక్రయించనున్నారు. తద్వారా బీపీటీతో పాటు కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ రకాల సన్నబియ్యం కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న తరుణంలో, ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ ఈ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా అర్హులైన వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.






