ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. ఇకపై కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా అర్హత నిర్ణయించకుండా.. అభ్యర్థి వాస్తవ క్రీడా ప్రతిభను నిర్ధారించేందుకు స్కిల్ టెస్ట్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం లేదా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలంటే అభ్యర్థి సంబంధిత స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగి ఉండటంతో పాటు, అవసరమైన చోట రాత పరీక్షలో అర్హత సాధించాలి. అంతేకాకుండా తాను సర్టిఫికెట్ సమర్పించిన క్రీడలో నిర్వహించే స్కిల్ టెస్ట్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
అభ్యర్థి ఏ క్రీడకు సంబంధించిన సర్టిఫికెట్ సమర్పిస్తే.. అదే క్రీడలో అతడి లేదా ఆమె నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, ఫిజికల్ డైరెక్టర్లు, శాప్ అధికారులు సభ్యులుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఈ విధానం ద్వారా కేవలం సర్టిఫికెట్లు ఉన్నవారికి కాకుండా నిజమైన ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అవకాశాలు దక్కేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు లేదా అడ్మిషన్లు పొందే అవకాశాలను అరికట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
విద్యా సంస్థల్లో వివిధ రకాల ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. దీనిపై పూర్తి స్థాయి మార్గదర్శకాలు, విధివిధానాలతో ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.
సాంఘిక సంక్షేమ శాఖలో సర్వీస్ రూల్స్ సవరణ
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌లోనూ పలు మార్పులు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అనుగుణంగా 1996 నాటి సాంఘిక సంక్షేమ సర్వీసు నిబంధనలను సవరించింది.
కొత్త సవరణల్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ASWO) పోస్టును గెజిటెడ్ హోదా కలిగిన కేటగిరీలో చేర్చారు. అలాగే వార్డెన్/మేట్రన్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టులను ఇకపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–1, గ్రేడ్–2గా పేర్కొనేలా నిబంధనల్లో మార్పులు చేశారు.
అదేవిధంగా ఏపీలోని రవాణా సబార్డినేట్ సర్వీసు నిబంధనలు–2009లోనూ పలు సవరణలు చేపట్టారు. పదోన్నతి పొందేందుకు కింది స్థాయి క్యాడర్‌లో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధనను అమలు చేయనున్నారు.







