ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా పరిచయమైనప్పటికీ, తనదైన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు అల్లు స్నేహారెడ్డి. కేవలం సెలబ్రిటీ భార్య అనే గుర్తింపుకే పరిమితం కాకుండా.. సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా, డిజిటల్ క్రియేటర్‌గా, ఆదర్శవంతమైన తల్లిగా బహుముఖ పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు 9.1 మిలియన్లకు (91 లక్షలు) పైగా ఫాలోవర్స్ ఉండటం ఆమెకున్న వ్యక్తిగత క్రేజ్‌కు అద్దం పడుతోంది.
‘పికాబూ’ (Picaboo) ఫోటోగ్రఫీ స్టూడియో వ్యవస్థాపకురాలిగా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన స్నేహారెడ్డి, మరోవైపు హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. రోజువారీ వర్కౌట్స్, హెల్తీ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అప్డేట్స్తో నెటిజన్లను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంటారు. కెరీర్‌తో పాటు ఫ్యామిలీకి సమాన ప్రాధాన్యం ఇచ్చే ఆమె.. పిల్లల పెంపకం, ఫ్యామిలీ ట్రిప్స్, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మంచి ఆదరణ దక్కించుకుంటున్నారు.
ప్రముఖ సినీ కుటుంబంలో కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. బిజినెస్, కుటుంబం, ఫిట్నెస్, లైఫ్స్టైల్లను బ్యాలెన్స్ చేస్తూ స్నేహారెడ్డి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అల్లు అర్జున్ భార్య అనే గుర్తింపును దాటి, స్వశక్తితో ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.






