హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. మెహదీపట్నంలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో రూ.4 లక్షల లంచం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీతను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
భవన నిర్మాణ అనుమతులు, క్లియరెన్స్‌కు సంబంధించిన వ్యవహారంలో ఓ వ్యక్తి నుంచి సునీత లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో సోమవారం మెహదీపట్నం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు.
బాధితుడి నుంచి సునీత రూ.4 లక్షలు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి భవన నిర్మాణ అనుమతులు, క్లియరెన్స్‌లకు సంబంధించిన ఫైళ్లు, పత్రాలను పరిశీలించారు.
ఈ వ్యవహారంలో సునీత గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? మరికొందరు అధికారులు లేదా సిబ్బందికి సంబంధం ఉందా? అనే కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోనూ ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్లు సమాచారం. ఆస్పత్రి ప్రారంభానికి సంబంధించిన అనుమతుల విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు ఆయన డ్రైవర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. లంచం డిమాండ్ వెనుక మరెవరైనా ఉన్నారా? అధికారుల మధ్య నగదు లావాదేవీలకు సంబంధించి ఏదైనా వ్యవస్థీకృత విధానం కొనసాగుతోందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న వరుస ఏసీబీ చర్యలతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.






