ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం, వసతి కేటాయింపుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నంతకాలం దర్శనం, వసతి కోసం సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే, తిరుమలకు స్వయంగా విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే నిబంధనల ప్రకారం దర్శనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కాలంలో సిఫార్సు లేఖల ద్వారా ప్రత్యేక దర్శనం లేదా వసతి పొందేందుకు ప్రయత్నించవద్దని భక్తులకు టీటీడీ సూచించింది. ఈ మార్పును గమనించి, నిబంధనలకు అనుగుణంగా సహకరించాలని కోరింది.






