విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. తొలుత అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, అదే రోజున ప్రసిద్ధ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల తేదీని ఒక రోజు వాయిదా వేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం విజయనగరం కార్పొరేషన్‌కు అక్టోబర్ 29న పోలింగ్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి. అయితే విజయనగరంలో సిరిమానోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, పరిపాలనా నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి పోలింగ్ తేదీని మార్చాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కలెక్టర్ అభ్యర్థనను పరిశీలించిన ఎన్నికల సంఘం విజయనగరం కార్పొరేషన్‌కు మాత్రమే పోలింగ్‌ను అక్టోబర్ 29కు మార్చేందుకు అనుమతించింది. దీంతో రాష్ట్రంలోని మిగతా పట్టణ స్థానిక సంస్థల్లో అక్టోబర్ 28న, విజయనగరం కార్పొరేషన్లో మాత్రం అక్టోబర్ 29న పోలింగ్ జరగనుంది.






