విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయని పేర్కొన్న న్యాయస్థానం, ఘటనకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, బాధితుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను గుర్తించి, చట్ట ప్రకారం వారిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని కూడా సూచించింది.






