అమరావతి: ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ, వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్ట ప్రాంతంలో 22.31 ఎకరాల భూమిపై నివసిస్తున్న 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
సుమారు రూ.600 కోట్ల విలువైన భూమిపై పేదలకు హక్కులు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో భరోసా కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పట్టాలు అందుకున్న 939 మంది లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉండటం మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందన్నారు. ఇళ్ల పట్టాలు అందుకున్న కుటుంబాలకు అభినందనలు తెలియజేసిన ఆయన, ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి పేదలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తోందని చంద్రబాబు వెల్లడించారు. 28 నెలల పాలనలో సంక్షేమం, అభివృద్ధితో పాటు సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించడం ద్వారా వారి నివాసాలకు చట్టబద్ధమైన భద్రత కల్పించడమే కాకుండా, భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంపొందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.






