విజయ్ సేతుపతి వ్యాఖ్యలతో తమిళనాట పొలిటికల్ హీట్.. విజయ్ అభిమానుల్లో ఆగ్రహం!
తమిళనాడులో సినీ నటుడు విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. “ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇవ్వడం.. సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షాన్ని నిందించడం నాయకుడి లక్షణం కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు తమిళ స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ను ఉద్దేశించే చేసినవేనంటూ ఆయన అభిమానులు, టీవీకే శ్రేణులు మండిపడుతున్నాయి.
అయితే ఈ వివాదంపై విజయ్ టెలివిజన్ సంస్థ వివరణ ఇచ్చింది. విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ, ఏ రాజకీయ నాయకుడినీ ఉద్దేశించి చేసినవి కావని, అవి కేవలం ‘బిగ్ బాస్’ కార్యక్రమానికి సంబంధించిన సందర్భంలో చేసిన సాధారణ వ్యాఖ్యలు మాత్రమేనని స్పష్టం చేసింది.
అయినప్పటికీ తమిళనాట రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కిన నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ సేతుపతి వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా? లేక ఇది కేవలం టీవీ షోలోని సందర్భోచిత వ్యాఖ్యలకే పరిమితమా? అన్న చర్చ కొనసాగుతోంది.







