ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం రాయలసీమలో కొత్త చర్చకు తెరతీసింది. ముఖ్యంగా అనంతపురం కేంద్రంగా ఆయన చేస్తున్న రాజకీయ ప్రకటనలు, రాయలసీమ అభివృద్ధి, యువతకు అవకాశాలు, ప్రాంతీయ ప్రయోజనాలపై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. విజయసాయిరెడ్డి ప్రతిపాదిత పార్టీని ఆంధ్రప్రదేశ్లో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిర్మించాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. కొత్త పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని, రాయలసీమ అభివృద్ధి, సాగునీరు, ఉపాధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోనని, పార్టీకి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తానని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాయలసీమలోని కొన్ని రాజకీయ వర్గాల్లో సహజంగానే కొత్త రాజకీయ వేదికపై ఆసక్తి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రధాన పార్టీల్లో రాజకీయంగా వెనుకబడిన నాయకులు, గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారు, స్థానికంగా ప్రభావం ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు కొత్త పార్టీ వైపు చూస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, పలువురు తాజా మాజీ జడ్పీటీసీలు విజయసాయిపార్టీలో టికెట్ల కోసం ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది..
అసంతృప్త నేతలకు కొత్త వేదిక?
టీడీపీ, వైసీపీ వంటి ప్రధాన పార్టీల్లో ఇప్పటికే ఉన్న నాయకత్వ వ్యవస్థ కారణంగా కొంతమంది స్థానిక నేతలకు తమ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటు అనేది వారికి మరో రాజకీయ వేదికగా కనిపించే అవకాశం ఉంది.
అయితే ఒక కొత్త పార్టీకి నాయకులు రావడం మాత్రమే కాకుండా స్థానిక స్థాయిలో క్యాడర్, సంస్థాగత నిర్మాణం, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకత్వం, ఓటర్లలో విశ్వాసం వంటి అంశాలు కూడా కీలకంగా మారతాయి. అందువల్ల ప్రస్తుతం కనిపిస్తున్న నేతల ఆసక్తి భవిష్యత్తులో వాస్తవ రాజకీయ బలంగా మారుతుందా అనేది పార్టీ నిర్మాణం ప్రారంభమైన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.







