స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రబాబు డెడ్లైన్ ఫిక్స్.
స్థానిక ఎన్నికల్లో 100 శాతo స్థానాలు కూటమి గెలవాలని మంత్రులకు సూచించారు. అన్ని ఎన్నికలు 30 రోజుల్లో చేసి, పాలనపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్ల నుంచి కూటమి పార్టీల సమన్వయం వరకు ఎన్నికల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొంటూనే నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల విడుదలపైనా కీలక ప్రకటన చేశారు.
కేబినెట్ భేటీ ముగిశాక సహచర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికలే అజెండాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సన్నద్ధత, బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని సూచించారు. ఈ ఎన్నికల ద్వారా కొత్త నాయకత్వం తెరపైకి వస్తుందని స్పష్టం చేశారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయమే ఎన్నికల్లో కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు.






