‘రణబాలి’ డాక్యుమెంటరీ సిరీస్ ప్రారంభం: చరిత్ర విస్మరించిన భయంకర కరువు నేపథ్యంతో తొలి ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ విడుదల!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న భారీ పీరియాడికల్ పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’. టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
సినిమాలోని చారిత్రక వాస్తవాలను, నేపథ్యాన్ని ప్రేక్షకులకు వివరించేందుకు ‘రణబాలి – నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్’ పేరిట 4 ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇందులో భాగంగా తొలి ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ (The Famine We Forgot) విడుదలైంది.
చరిత్ర దాచిన ఘోర నిజం: తొలి ఎపిసోడ్ విశేషాలు
1876-1878 మధ్య బ్రిటీష్ పాలనలో తలెత్తిన భయంకరమైన కరవు వల్ల కోటి మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషాద గాథను ఈ ఎపిసోడ్‌లో వెల్లడించారు. ఒకవైపు ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తుంటే, మరోవైపు బ్రిటీషర్లు ఇక్కడి నుంచి టన్నుల కొద్దీ ధాన్యాన్ని తమ దేశానికి తరలించిన అమానవీయ ఘటనలను సుమారు 150 ఏళ్ల చరిత్ర ఆధారంగా పరిశోధించి వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
చిత్ర యూనిట్ మాటల్లో:
-
దర్శకుడు రాహుల్ సంకృత్యన్:“బ్రిటీష్ సామ్రాజ్య నేపథ్యంపై వందల సినిమాలు వచ్చినా ఎవరూ ఈ ఘోర కరువు గురించి ప్రస్తావించలేదు. నాటి 25-30 కోట్ల భారత జనాభాలో ఏకంగా కోటి మందిని బలిగొన్న ‘ది గ్రేట్ మద్రాస్ కరువు’ చరిత్రలో అతిపెద్ద విషాదం. దీనికి సంబంధించిన అసలైన వాస్తవాల కోసం పాత లైబ్రరీలు, ప్రభుత్వ రికార్డులు, పురాతన గెజిట్‌లను పరిశీలించి తీవ్రమైన పరిశోధన చేశాం.”
-
హీరోయిన్ రష్మిక మందన్న:“ఈ చారిత్రక కరువు నాటి చేదు నిజాలను తెలుసుకున్నప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మన పూర్వీకులు పడిన వేదన, చేసిన త్యాగాల గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను. ఇలాంటి నిజాయితీ గల గొప్ప సినిమాలో భాగం కావడం ఎంతో అరుదైన అవకాశం.”
-
హీరో విజయ్ దేవరకొండ:“మనవాళ్లు ఆకలితో అల్లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే, అదే సమయంలో బ్రిటీష్ పాలకులు లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలను తమ దేశానికి, సైన్యానికి ఎగుమతి చేసుకున్నారు. చివరికి కడుపు నిండా తిండి లేకపోయినా మన ప్రజలే ఆ బస్తాలను మోయాల్సి రావడం ఎంతటి దారుణం! ఈ సత్యాన్ని భవిష్యత్ తరాలకు గుర్తుచేస్తూ, ఆ దుర్ఘటనలో అమరులైన కోట్లాది భారతీయులకు నివాళిగా ‘రణబాలి’ని రూపొందించాం.”
డాక్యుమెంటరీ సిరీస్ తదుపరి ఎపిసోడ్ల వివరాలు:
-
రెండో ఎపిసోడ్: ‘ది హిస్టరీ వి ఫర్ గాట్’ (ఈ నెల 30న)
-
మూడో ఎపిసోడ్: ‘ది మెన్ వి ఫర్ గాట్’ (అక్టోబర్ 2న)
-
నాల్గో ఎపిసోడ్: ‘ది లాస్ట్ లోడ్’ (విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు)






