అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు హెచ్-1బీ వీసా విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బీ వీసాలపై విధించిన 1 లక్ష అమెరికన్ డాలర్ల చెల్లింపు నిబంధనను 2027 సెప్టెంబర్ 21 వరకు పొడిగిస్తూ ట్రంప్ ప్రభుత్వం కొత్త అధ్యక్ష ప్రకటన జారీ చేసింది.
2025లో తీసుకొచ్చిన ఈ నిబంధన ప్రకారం.. అమెరికా వెలుపల ఉన్న విదేశీ నిపుణుల కోసం కొత్తగా హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసే కంపెనీలు సంబంధిత ఉద్యోగి తరఫున 1 లక్ష డాలర్ల చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అయితే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావించిన సందర్భాల్లో ఈ చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు ఉంటుంది.
అయితే ఈ ఫీజు అమలుపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. గతంలో అమెరికా ఫెడరల్ కోర్టు ఈ నిబంధనను చట్టవిరుద్ధంగా పేర్కొనడంతో ప్రస్తుతం కోర్టు ఆదేశాల కారణంగా 1 లక్ష డాలర్ల ఫీజు వసూలు నిలిచిపోయింది.
తాజా అధ్యక్ష ప్రకటన ప్రధానంగా అమెరికా వెలుపల ఉన్న హెచ్-1బీ ఉద్యోగులు కొత్తగా అమెరికాలో ప్రవేశించేందుకు దరఖాస్తు చేసే కేసులకు సంబంధించినది. ఇప్పటికే అమెరికాలో ఉన్న కొంతమంది హెచ్-1బీ ఉద్యోగులకు, అలాగే అమెరికాలోనే మరో వీసా కేటగిరీ నుంచి హెచ్-1బీకి మారే వారికి ఈ చెల్లింపు నేరుగా వర్తించదు.
దీంతో అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ నిపుణులు, ముఖ్యంగా కొత్తగా హెచ్-1బీ ద్వారా అమెరికాలో ప్రవేశించాలనుకునే వారికి ఈ పరిణామం కీలకంగా మారింది.







