‘కోర్ట్’తో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ మరోసారి టీనేజ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్షత్ర హీరోయిన్గా పరిచయమైన ‘తెల్లకాగితం’కు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. నందు సవిరిగాన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం, కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ అందించారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా టీనేజ్ ప్రేమతో పాటు బాధ్యత, కుటుంబ విలువలు, అవగాహన వంటి అంశాలను టచ్ చేస్తుంది.
కథ:
రాము (హర్ష్ రోషన్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అన్నా వదినల సంరక్షణలో పెరుగుతుంటాడు. పదో తరగతిలో చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ ఆశ (నక్షత్ర)తో పరిచయం ఏర్పడుతుంది. చిన్న పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆశ కూడా రామును ఇష్టపడుతుంది.
అయితే వయసుకు తగిన అవగాహన లేకుండా ఇద్దరూ తీసుకున్న ఓ నిర్ణయం వారి జీవితాలను ఊహించని మలుపులోకి తీసుకెళ్తుంది. ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? తల్లిదండ్రులకు నిజం చెప్పాలా? దాన్ని దాచిపెట్టి ముందుకు వెళ్లాలా? అనే పరిస్థితుల్లో రాము, ఆశ ఎదుర్కొనే సంఘర్షణే కథకు ప్రధానాంశం.
విశ్లేషణ:
‘తెల్లకాగితం’ సాధారణ టీనేజ్ లవ్ స్టోరీగా మొదలై.. క్రమంగా బాధ్యత, అవగాహన, కుటుంబ బంధాల వైపు వెళ్లే కథ. ఆ వయసులో తీసుకునే ఓ నిర్ణయం భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందనే అంశాన్ని దర్శకుడు కథలో ప్రధానంగా తీసుకున్నారు.
రాము, ఆశ మధ్య పరిచయం, ప్రేమ చిగురించే సన్నివేశాలు సహజంగా, అమాయకంగా సాగుతాయి. గ్రామీణ నేపథ్యం, యూత్‌ఫుల్ సన్నివేశాలు, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ సినిమాకు మంచి ప్రారంభాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, ప్రేమ సన్నివేశాలు సినిమాకు మంచి ఫీల్‌ను తీసుకొస్తాయి.
ఇక కథలో అసలు సమస్య మొదలైన తర్వాత సినిమా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. టీనేజ్‌లో వచ్చే ఆకర్షణ, అవగాహన లోపం, సేఫ్టీ, తల్లిదండ్రులతో పిల్లల మధ్య సంభాషణ వంటి సున్నితమైన అంశాలను దర్శకుడు కథలో భాగం చేశారు. ఈ అంశాలను అసభ్యతకు తావులేకుండా చెప్పే ప్రయత్నం చేయడం సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది.
ముఖ్యంగా పిల్లలు ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు భయంతో దాచిపెట్టకుండా తల్లిదండ్రులతో మాట్లాడాలి అనే ఆలోచనను సినిమా బలంగా ముందుకు తీసుకొస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఓపికగా మాట్లాడి, వారి సమస్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.
కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపించినా.. క్లైమాక్స్‌కు ముందు వచ్చే భావోద్వేగ సన్నివేశాలు బలంగా ఉన్నాయి. వినోదంతో పాటు సామాజిక అవగాహన కలిగించే అంశాన్ని జోడించడం ఈ సినిమాకు ప్రత్యేకత.
నటీనటులు:
హర్ష్ రోషన్ రాము పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమలో పడిన కుర్రాడిగా, ఆ తర్వాత పరిస్థితుల కారణంగా అయోమయానికి గురయ్యే యువకుడిగా అతడి నటన బాగుంది. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పరిధిలో మెప్పించాడు.
నక్షత్రకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆశ పాత్రలో సహజంగా కనిపించింది. అమాయకత్వంతో పాటు భావోద్వేగాలను చక్కగా పలికించింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
అజయ్, శరణ్య ప్రదీప్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీ టైమింగ్ కూడా ఫస్ట్ హాఫ్‌లో నవ్వులు పంచుతుంది.
సాంకేతిక వర్గం:
టెక్నికల్‌గా ‘తెల్లకాగితం’ మంచి స్థాయిలో ఉంది. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు యూత్‌ఫుల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా మెలోడీ పాటలు కథలోని ప్రేమ భావనకు మంచి ఫీల్‌ను తీసుకొస్తాయి. కీలక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపాక్ట్ పెంచుతుంది.
కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. భీమవరం, గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించారు. విజువల్స్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి.
రచయిత నందు సవిరిగాన ఎంచుకున్న పాయింట్లో మంచి సామాజిక అంశం ఉంది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి టీనేజ్ ప్రేమకథను కేవలం రొమాన్స్‌గా కాకుండా.. దాని వెనుక ఉన్న బాధ్యత, కుటుంబ బంధాలు, పిల్లలు–తల్లిదండ్రుల మధ్య అవగాహన వంటి అంశాలతో ముడిపెట్టాడు.
ప్లస్ పాయింట్స్:
టీనేజ్ లవ్ స్టోరీ
మంచి సామాజిక సందేశం
హర్ష్ రోషన్ నటన
నక్షత్ర సహజమైన పెర్ఫార్మెన్స్
హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ
యూత్‌ఫుల్ పాటలు
కుటుంబ భావోద్వేగాలు
కె.వి. గుహన్ విజువల్స్
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాల్లో కథనం నెమ్మదించడం
సెకండాఫ్‌లో వేగం మరింత ఉంటే బాగుండేది
కొన్ని సన్నివేశాలు రిపీట్ అయిన భావన కలగడం
చివరగా:
‘తెల్లకాగితం’ ఒక అమాయకమైన టీనేజ్ ప్రేమకథగా మొదలై.. బాధ్యత, అవగాహన, కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పాత్ర వంటి అంశాలను చర్చించే ఎమోషనల్ డ్రామాగా మారుతుంది.
రేటింగ్: 3





