దసరా బరిలో ‘మయూఖ’.. ఆకట్టుకున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్!
పాయల్ చెంగప్ప టైటిల్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ “మయూఖ”. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ పతాకంపై శశిధర్ నల్ల నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రెస్మీట్లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి, అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా దసరా కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర బృందం మాట్లాడిన ముఖ్యాంశాలు:
-
దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె.: యూఎస్ కెరీర్‌ను వదిలి సినిమాపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చానని, తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత శశిధర్‌కి, కథను నమ్మిన పాయల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్, కొరియన్ సినిమాల స్థాయిలో కలర్ గ్రేడింగ్‌తో సరికొత్తగా తీర్చిదిద్దామని, థియేటర్లలో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతిని ఖచ్చితంగా ఇస్తుందని హామీ ఇచ్చారు.
-
హీరోయిన్ పాయల్ చెంగప్ప: ప్రస్తుత పరిస్థితుల్లో ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్‌తో సినిమా తీయడం సాహసమని, నిర్మాత శశిధర్ ఎంతో గట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ఒక యువతి చూపించే తెగువ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుందని, కథ విన్నప్పుడు తనకు కలిగిన థ్రిల్ చూసే ప్రతి ఒక్కరికీ కలుగుతుందని పేర్కొన్నారు.
-
నిర్మాత శశిధర్ నల్ల: మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఆ బలమైన నమ్మకంతోనే దసరా సెలవుల్లో అక్టోబర్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా తర్వాత పాయల్‌ను అందరూ ‘మయూఖ’గానే గుర్తిస్తారని, దర్శకుడు శ్రీ తేజ్ సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించారని ప్రశంసించారు.
-
నటీనటులు: మాస్టర్ షణ్ముఖ చరణ్ (వీరు పాత్ర), బేబి మది నస్రీన్ (చిన్నప్పటి మయూఖ), నానానీ కర్రి (సెక్యూరిటీ రవి), దేవ్ డి (ఎస్ఐ దేవ్), రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ మాట్లాడారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉందని, పాయల్ అద్భుత నటనతో పాటు దర్శకుడి ప్రతిభ థియేటర్లలో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.






