కథలో కొత్తదనం కంటే కథను చెప్పిన విధానం, సముద్రం నేపథ్యంలో తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘మండాడి’. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతాల్లో జరిగే సంప్రదాయ పడవ పందేల నేపథ్యాన్ని తీసుకుని రూపొందింది. సినిమా ప్రారంభం నుంచి గ్రామీణ వాతావరణం, సముద్ర జీవితం, ఆధిపత్య పోరు, వ్యక్తిగత వైరంతో కథ రూపొందించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
ముత్తుకాళి (సూరి) సముద్రంలో చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకారుడు. అదే సమయంలో సంప్రదాయ పడవ పందేల్లో తిరుగులేని ఆటగాడిగా పేరున్న వ్యక్తి. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన గ్రామానికి దూరంగా ఉంటాడు.
అయితే తన ప్రాంతంలోని మత్స్యకారులు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో తిరిగి వస్తాడు. ఆరుగురు సహచరులతో కలిసి సంప్రదాయ పడవ పందేల్లో పాల్గొంటాడు.
ముత్తుకాళికి చిరకాల ప్రత్యర్థి సట్టై పులి (సుహాస్). వీరిద్దరి మధ్య ఉన్న పాత వైరం, ఆధిపత్య పోరు, పడవ పందేల చుట్టూ జరిగే సంఘటనలే కథను ముందుకు నడిపిస్తాయి. ముత్తుకాళి గతంలో గ్రామాన్ని ఎందుకు వదిలి వెళ్లాడు? సట్టై పులితో అతడి వైరం ఏమిటి? పడవ పందేల్లో ఎవరు గెలుస్తారు? అనే అంశాలతో కథ సాగుతుంది.
విశ్లేషణ
‘మండాడి’లో కథాంశం చూస్తే ఇది ఒక సాధారణ స్పోర్ట్స్ డ్రామాలా అనిపించినా, బోట్ రేసింగ్‌ను కథలో అంతర్భాగంగా మలిచిన విధానం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఫస్ట్ హాఫ్‌లో గ్రామంలోని సమస్యలు, పాత్రల పరిచయం, సూరి–సుహాస్ మధ్య వైరాన్ని దర్శకుడు క్రమంగా ఎస్టాబ్లిష్ చేశారు. కథను అనవసరమైన కామెడీ లేదా ఫిల్లర్ సన్నివేశాలతో నింపకుండా ముందుకు తీసుకెళ్లడం ప్లస్ పాయింట్.
అయితే సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ కారణంగా కొంత నెమ్మదిగా స్టోరీ నడుస్తుంది. కథలో కొన్ని అంశాలు ముందే ఊహించగలిగేలా ఉన్నప్పటికీ, బోట్ రేస్ సన్నివేశాలు ఆ లోటును చాలావరకు భర్తీ చేస్తాయి.
నటీనటుల నటన
సూరి ముత్తుకాళి పాత్రలో అద్భుతంగా నటించారు. కామెడీ పాత్రల నుంచి సీరియస్ లీడ్ రోల్స్ వైపు ఆయన సాగిస్తున్న ప్రయాణంలో ‘మండాడి’ మరో మంచి ప్రయత్నంగా నిలుస్తుంది. పాత్రలోని కోపం, బాధ, పట్టుదల వంటి భావోద్వేగాలను బాగా పలికించారు.
సుహాస్ సట్టై పులి పాత్రలో కొత్త షేడ్స్ చూపించారు. విలన్‌గా ఆయన నటన సినిమాకు మంచి బలాన్ని ఇచ్చింది. సూరి–సుహాస్ మధ్య ఉండే వైరం, పోటాపోటీ సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి.
మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
సాంకేతికంగా ‘మండాడి’కి సముద్రంలో చిత్రీకరించిన బోట్ రేసింగ్ సన్నివేశాలే ప్రధాన ఆకర్షణ. రా విజువల్స్, సముద్ర వాతావరణాన్ని క్యాప్చర్ చేసిన సినిమాటోగ్రఫీ సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి.
జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. ముఖ్యంగా బోట్ రేసింగ్, ఇంటర్వెల్ తరహా హై మూమెంట్స్‌లో మ్యూజిక్ ఇంపాక్ట్ బాగా పనిచేసిందని ప్రేక్షకుల స్పందనల్లో కనిపిస్తోంది.
ఎడిటింగ్ కూడా ఎక్కువగా కథను గాడి తప్పకుండా ఉంచుతుంది. అయితే సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్ భాగాన్ని మరింత కుదించి ఉంటే సినిమా మరింత వేగంగా సాగేదనే అభిప్రాయం కలుగుతుంది.
ఫైనల్‌గా
‘మండాడి’ కథ పరంగా పూర్తిగా కొత్తదనం చూపించకపోయినా, సముద్రం నేపథ్యంలో తెరకెక్కించిన బోట్ రేసింగ్ యాక్షన్ సన్నివేశాలు, సూరి–సుహాస్ నటన, GV ప్రకాశ్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
కొన్ని చోట్ల సెకండాఫ్ నెమ్మదించడం, కథలోని కొన్ని అంశాలు ముందే ఊహించగలగడం మైనస్‌లుగా ఉన్నప్పటికీ, బలమైన యాక్షన్, సహజమైన గ్రామీణ వాతావరణం, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ‘మండాడి’ ఒక మంచి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా నిలుస్తుంది.
రేటింగ్: 2.25/5







