దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లు నడుపుతున్న కేంద్రం, కొత్త డిమాండ్ ఉన్న మార్గాల్లో కూడా ఈ సేవలను విస్తరిస్తోంది. రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి, అవసరానికి అనుగుణంగా వందేభారత్ రైళ్లను కేటాయిస్తున్నది. ఇటీవలే పలు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొత్త వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలు వెలువడ్డాయి. విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం–తిరుపతి మార్గాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలని కేంద్రాన్ని కోరామని ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ఈ ప్రతిపాదనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.
అంతేకాక, మంగళపాలెం వద్ద ఆర్‌యూబీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యను గుర్తుచేసి, అక్కడ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా మంత్రి అనుకూలంగా ఉన్నారని చెప్పారు. విశాఖపట్నం రైల్వే జోన్‌కు సంబంధించిన కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.