75 ఏళ్ల వయోపరిమితి, బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ స్పందించారు. బీజేపీ తరఫున నిర్ణయాలు ఆర్ఎస్ఎస్ తీసుకుంటుందనే ప్రతిపక్షాల ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. కేంద్రంతో ఎటువంటి పెద్ద విభేదాలు లేవని, చిన్న చిన్న అంశాలు తప్ప పరస్పర సమన్వయం బాగానే కొనసాగుతోందని తెలిపారు.
“కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో మాకు ఎల్లప్పుడూ సుహృద్భావం ఉంది. అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించే వ్యవస్థలు మన వద్ద ఉన్నాయి. ఎటువంటి గొడవ లేదు. ప్రతి ప్రభుత్వంతోనూ మాకు సఖ్యతే ఉంటుంది” అని భగవత్ పేర్కొన్నారు.
75 ఏళ్ల వయసు నిండితే తప్పుకోవాలని తాను ఎప్పుడూ చెప్పలేదని, అలానే తానే కూడా ఆ వయసులో తప్పుకుంటానని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. సంఘ్ ఇచ్చే మార్గదర్శకత్వాన్నే తాను అనుసరిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ శతజయంతి వేడుకల్లో చేశారు.
బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఆధీనంలోనే నడుస్తుందన్న ఆరోపణలు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ–హోం మంత్రి అమిత్ షా ద్వయం సంఘ్‌తో విబేధాలు పెంచుకుంటున్నారన్న అభిప్రాయాలపై కూడా భగవత్ స్పష్టత ఇచ్చారు. “పోరాటం ఉండొచ్చు, కానీ ఘర్షణ మాత్రం ఉండదు. రాజీ అనే మాట బయటకు రాగానే పోరాటం ముదురుతుంది. కానీ మనం ఒక్కటిగా ముందుకు సాగుతాం” అని భగవత్ పేర్కొన్నారు.