అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త వాణిజ్య సుంకాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసంతృప్తిగా ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ట్రంప్ నాలుగు సార్లు ఫోన్‌లో మాట్లాడటానికి ప్రయత్నించినా, మోదీ కాల్స్ స్వీకరించలేదని జర్మన్ పత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్గెమైన్ జైటంగ్ (FAZ) నివేదించింది. ఇది మోదీ అసహనాన్ని, ట్రంప్ నిర్ణయాలపై జాగ్రత్త వైఖరిని సూచిస్తోందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని కూడా నివేదికలో పేర్కొంది.
ట్రంప్‌తో మాట్లాడటానికి ప్రధానమంత్రి ఇష్టపడకపోవడం, అమెరికా అధ్యక్షుడి చర్యలు మోదీని ఎంతగా అసంతృప్తి పరచాయో చూపిస్తోందని FAZ రాసుకొచ్చింది. గత రెండు దశాబ్దాలుగా చైనాను ఎదుర్కోవడంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇండియా–అమెరికా సంబంధాలు బలపడగా, ట్రంప్ భారీ సుంకాలు విధించడం వల్ల ఇండో–పసిఫిక్ అలయన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషించింది.
జపాన్ పత్రిక నిక్కీ ఆసియా కూడా ఇలాంటి కథనమే ప్రచురించింది. ట్రంప్ కాల్స్‌ను మోదీ తప్పించుకుంటున్నారని, దీంతో ట్రంప్‌లో నిరాశ పెరుగుతోందని రాసింది. భారతీయ వస్తువులపై అమెరికా విధించిన సుంకాలు 50 శాతం దాటడంతో న్యూఢిల్లీ–వాషింగ్టన్ సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇంత పెద్ద సుంక భారం ఎదుర్కొంటున్న దేశాల్లో బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపింది.
ఇక భారత్ తరఫున, అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.