Sahasra Case

కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో సహస్రను పక్కనే బిల్డింగ్‌లో నివసిస్తున్న పదో తరగతి విద్యార్థి హత్య చేసినట్లు బయటపడింది. ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం – దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడ్డ బాలుడు, ముందే కత్తి తీసుకెళ్లాడు. ఇంట్లో నుండి రూ.80 వేలు నగదు దొంగిలించాడు. అదనంగా దేవుడి దగ్గర ఉంచిన హుండీని పగులగొట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలిక సహస్ర అతడిని చూసి కేకలు వేయడంతో, ఆమెపై విచక్షణారహితంగా కత్తిపోట్లు కూర్చి ప్రాణాలు తీశాడు. సహస్ర బతకకూడదని నిశ్చయించి వరుసగా పొడిచినట్లు పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం బాలుడు సుమారు 15 నిమిషాలు పక్క బిల్డింగ్‌లో దాక్కున్నాడు. ఈ కదలికలను గమనించిన ఓ ఐటీ ఉద్యోగి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాని ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. మొదట అతను నేరాన్ని ఒప్పుకోకపోవడంతో పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

సోదాల్లో రక్తపుమచ్చలతో ఉన్న దుస్తులు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఇంగ్లీష్‌లో వాక్య నిర్మాణం తప్పుగా ఉన్నా, “How to open door”, “How to open God hundi” వంటి పదాలు రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు నెట్‌లో చూసి దొంగతనం చేయడానికి సంబంధించిన వివరాలను పేపర్‌పై రాసుకున్నట్లు తేలింది.

దొంగతనానికి ముందు ఏం చేయాలి, ఎక్కడ, ఎలా తప్పించుకోవాలి అన్న ప్రతిదాన్ని బాలుడు పక్కాగా ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సహస్ర అరిచినప్పుడు, ఆ ప్రణాళిక హత్యకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *