ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. శాఖలో ఖాళీగా ఉన్న 500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఉద్యోగాల్లో అర్చకులు సహా అన్ని విభాగాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పాలకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మికతను ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,250 ఆలయాలకు దూపదీప నైవేద్య పథకం అమలులో ఉందని తెలిపారు.
ఇక వినాయక చవితి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 16 వరకు కొనసాగనున్నాయి. తొలి రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమర్పించారు.