ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా ప్రభావం చూపిస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీర ప్రాంతంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసి, మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షాల సూచన ఉన్నట్లు, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో అత్యధికంగా 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లా మలికిపురంలో 74.5 మిల్లీమీటర్లు, భీమవరంలో 67.5 మిల్లీమీటర్లు, విజయవాడ పశ్చిమలో 62.5 మిల్లీమీటర్లు, విజయవాడ సెంట్రల్‌లో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.