ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు సంబంధించిన కాల్ లెటర్స్ను కూడా అందజేసింది. అయితే, ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ నెలకొంది.
ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి భారీ అంచనాలు పెట్టుకున్న నిరుద్యోగులకు, సర్కార్ ప్రవర్తన ఆశాజనకంగా అనిపించలేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, దాని ప్రకారం నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. త్వరలోనే 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు.
ఉస్మానియా యూనివర్శిటీలో రూ.80 కోట్లతో నిర్మించిన హస్టల్ భవనాలను ప్రారంభించేందుకుగాను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూలో అడుగుపెట్టారు. హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి.. సుమారు 40 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 55 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు.