ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రజలకు మేలు చేయడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ సిస్టమ్‌పై సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఆధార్ కార్డు మాదిరిగానే ఉండే ఈ ఫ్యామిలీ కార్డులో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల వివరాలు కూడా ఈ కార్డులో పొందుపరచాలని, అవసరాన్ని బట్టి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబ అవసరాలపై గ్రామ స్థాయిలో సమాచారం సేకరించాల్సిందిగా సీఎం దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఆ కుటుంబాలకు ఏదైనా సంక్షేమ పథకం అవసరమైతే వెంటనే అందేలా ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం కుటుంబాలు విడిపోవాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే అందరికీ లబ్ధి చేకూరేలా పథకాలను పునర్నిర్మించడాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
ఇక త్వరలోనే రాష్ట్రంలో జనాభా విధానాన్ని అమలు చేయాలని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు, సహాయాల సమాచారం ఫ్యామిలీ కార్డులో ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఆధార్ లాగే ఈ ఫ్యామిలీ కార్డును అధికారులు, ప్రభుత్వం, ప్రజలు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.