పంటల ప్రారంభ దశలోనే యూరియా అవసరం అత్యంత కీలకం. కానీ ప్రస్తుతం యూరియా లభ్యం కష్టమైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారకముందే క్యూలలో నిల్చున్నా, బస్తా యూరియా పొందడం కష్టతరమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుల కొరత పంటల ఎదుగుదలకు ఆటంకంగా మారడంతో రైతుల్లో నిరాశ, ఆగ్రహం పెరిగింది. ఈ అసంతృప్తి గురువారం అనేక ప్రాంతాల్లో నిరసనలకు దారితీసింది. ఎరువుల కేంద్రాల వద్ద రైతులు గుంపులుగా చేరి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కొన్ని చోట్ల తోపులాటలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఓ వృద్ధ రైతు ఎరువుల కేంద్రం మెట్లపై నుంచి కిందపడడంతో గాయపడ్డారు. అక్కడ యూరియా దొరక్కపోవడంతో రైతులు రహదారిపై ధర్నా నిర్వహించగా, రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని నిల్వ ఉన్న యూరియాను కొంతమంది రైతులకు పంపిణీ చేయించారు. కురివిలో 444 యూరియా బస్తాలు ఉండగా, 1200 మందికి పైగా రైతులు చేరుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని సహకార మార్కెటింగ్ సంఘం వద్ద రైతులు చెప్పులు ఉంచి క్యూలు ఏర్పాటు చేశారు. హన్వాడ, భూత్పూర్, దేవరకద్ర మండలాల్లోనూ భారీ క్యూలైన్లు కనిపించాయి. “పదెకరాలున్న రైతుకూ ఒకే బస్తా యూరియా ఇస్తారా?” అంటూ ఖమ్మం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగూడెం జిల్లా పాల్వంచలో, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో, రంగారెడ్డి జిల్లా చేగూరులో, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కూడా రైతులు ఆందోళనలకు దిగారు. కొన్నిచోట్ల ఒక్కోరికి రెండు బస్తాలకే పరిమితం చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్నశంకరంపేట మండలంలో యూరియా లారీ రాగానే రైతులు టోకెన్ల కోసం పోటెత్తారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్‌లో పోలీసుల పహారా మధ్య టోకెన్లు పంపిణీ చేశారు.
యూరియా కోసం డబ్బులు కట్టి వారం గడిచినా సరఫరా చేయకపోవడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ ఎరువుల సంక్షోభం అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది.