తెలంగాణలో గత రెండు వారాలుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రతి రోజూ వరుణుడు పలకరిస్తూనే ఉన్నాడు. పలు జిల్లాల్లో అయితే కుండపోత వర్షాలు జనజీవనాన్ని స్తంభిపంజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.