పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? సాధారణంగా దీపావళి, అక్షయ తృతీయ వంటి పర్వదినాల సందర్భంగా వాహనాలు కొనుగోలు చేస్తే శుభమని చాలా మంది నమ్మకం. ఈ నేపధ్యంలో కార్ల తయారీ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక ఆఫర్లను, భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి.
ఇదిలా ఉండగా, ఆటోమొబైల్ రంగానికి మరో శుభవార్త కూడా అందింది. జీఎస్టీ సంస్కరణలను త్వరలో అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఎక్కువ కార్లపై 28 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. అయితే దీన్ని 18 శాతం శ్లాబ్‌లోకి తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 12% మరియు 28% శ్లాబ్‌లను రద్దు చేసి, 0%, 5% మరియు 18% శ్లాబ్‌లను మాత్రమే కొనసాగించే ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ ప్రకటన ఈ పండుగ సీజన్‌లోనే వెలువడే అవకాశముందని తెలిసింది.