ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. జన్ సువాయి కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రాజేష్ సకారియా అనే 41 ఏళ్ల వ్యక్తి ముందుకు వచ్చి సీఎంకు కొన్ని పత్రాలు అందజేశాడు. అనంతరం ఒక్కసారిగా ఆగ్రహంతో కేకలు వేస్తూ ఆమెపై దాడి చేశాడు. చేతితో కొట్టడంతో పాటు, జుట్టు కూడా పీకినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే దర్యాప్తు కొనసాగుతుండగా, తాజాగా మరో వ్యక్తి అరెస్టు అయ్యాడు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇతడే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణలో మరో కీలక నిందితుడి పేరు బయటకు తీసుకువచ్చారు.
రాజేష్‌కు అత్యంత సన్నిహితుడైన తాహసీన్ సయ్యద్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన తాహసీన్, దాడికి ముందు రాజేష్ ఖాతాకు రూ.2,000 బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దాడి జరిగే క్షణాల ముందు ఈ డబ్బు బదిలీ జరగడం ఇద్దరూ ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.